ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌దే మళ్లీ అధికారం అని ధీమా

ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌దే మళ్లీ అధికారం అని ధీమా
ఖమ్మం జిల్లా చింతకాని వేదికగా నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు రాజకీయ అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్న సీఎం, రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని అన్నారు. 2023లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు భారీగా స్పందించి బీఆర్ఎస్‌ను ఓడించారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావడం కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని చెప్పారు.రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబరులో కాకుండా 2029 మే లేదా జూన్‌లో జరిగే అవకాశముందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, ప్రజలను తప్పుదారి పట్టించే సర్వేలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్, నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్లపై స్పష్టత లేకుండానే విజయాపజయాలపై సర్వేలు చేయడం ప్రజలను గందరగోళానికి గురిచేయడమేనని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పటికే కుంగిపోవడంతో భారీ నష్టం జరిగిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ నీటిని నిల్వ చేయాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా పలు గ్రామాలు నష్టపోయాయని గుర్తుచేస్తూ, ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు.బీఆర్ఎస్ నాయకత్వంపై వ్యాఖ్యానిస్తూ, ఆ పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని విమర్శించారు. హరీష్ రావు, బీజేపీ చేరికపై వస్తున్న ప్రచారాలపై స్పందించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ, షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అదనంగా పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా సాయాన్ని రూ.12 వేల వరకు పెంచడంతో పాటు రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతులకు ఊరట కల్పించినట్లు వివరించారు.

భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడిన సీఎం, తెలంగాణకు పెరగనున్న పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌కు అధిక స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు మధిరలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతి, అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు