గుండాల మండలం జూలై 2 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
ఆదివాసీ నాయకుడు, మాజీ దళ కమాండర్ కోరం గణేష్ కవితక్క సమక్షంలో టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీలో చేరారు. ఆదివాసీ నాయకుడు వాసం రామకృష్ణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ రూప్ సింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కవితక్క మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు, ప్రజా సంఘాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఆదివాసీ నాయకుడిగా గిరిజనుల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం కోరం గణేష్ చురుకుగా పనిచేయాలని, ముఖ్యంగా పినపాక నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
ఈ నెల 10వ తేదీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులను కవితక్క పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటన అనంతరం మణుగూరులో జరిగే భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యకర్తలు, నాయకులకు కవితక్క చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉన్న యువత, కార్యకర్తలు, కవితక్క అభిమానులు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.
అనంతరం కోరం గణేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ ఉన్న రైతులకు మాత్రమే ఎరువులు అందించే విధానాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యల కారణంగా అనేక మంది ఆదివాసీ, గిరిజనేతర రైతులు సకాలంలో ఆన్‌లైన్ నమోదు చేసుకోలేక ఎరువులకు దూరమవుతున్నారని అన్నారు.
అటవీ హక్కుల పత్రాలు లేని రైతులు, పట్టాలు ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు వారాల తరబడి రైతు వేదికలు, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎరువులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ, గిరిజనేతర రైతులకు ఆన్‌లైన్ బుకింగ్‌తో సంబంధం లేకుండా వ్యవసాయ ఎరువులు, విత్తనాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ఆదివాసీ సంఘం నాయకుడు కోరం గణేష్ డిమాండ్ చేశారు.
0 కామెంట్‌లు