వీరాపురం ఇసుక రీచ్ వివాదం: పీఓ హామీతో నిరాహార దీక్ష విరమణ

వీరాపురం ఇసుక రీచ్ వివాదం: పీఓ హామీతో నిరాహార దీక్ష విరమణ
పినపాక : వీరాపురం ఇసుక రీచ్ వివాదానికి న్యాయమైన పరిష్కారం, రెండు ఆదివాసి సొసైటీలకు సమన్యాయం కల్పించడం, ఆదివాసుల జీవనోపాధిని పరిరక్షించడం వంటి డిమాండ్లతో శ్రీగిరి లక్ష్మి సొసైటీ సభ్యులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం ముగిసింది. టీజీఎండీసీ (పీఓ) సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారం నుంచి పది రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి మాట్లాడుతూ, ఆదివాసుల సమస్యలపై స్పందించి హామీ ఇచ్చిన టీజీఎండీసీ (పీఓ)కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇచ్చిన హామీని నిర్ణీత గడువులో అమలు చేసి వీరాపురం ఇసుక రీచ్ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.రెండు ఆదివాసి సొసైటీలకు న్యాయబద్ధంగా సమన్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆదివాసుల మధ్య విభేదాలు తొలగించి ఐక్యతను కాపాడే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.అధికారుల హామీపై విశ్వాసంతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహార దీక్షను విరమించామని శ్రీగిరి లక్ష్మి సొసైటీ సభ్యులు తెలిపారు. తమ ఉద్యమానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హామీలు అమలు కాకపోతే చట్టబద్ధమైన, శాంతియుత ప్రజాస్వామ్య మార్గాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు