వాళ్లున్నప్పుడు గంజాయి సాగు ఉండేది కాదు
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
జులై 8 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గంజాయి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాప్తిపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, "గంజాయి విక్రయిస్తున్న వారి కంటే మావోయిస్టులే బెటర్ అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మావోయిస్టులు ఉన్న ప్రాంతాల్లో గంజాయి సాగు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం గంజాయి స్మగ్లింగ్ గణనీయంగా పెరిగింది" అని వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ గంజాయి స్మగ్లర్ల సంఖ్య పెరుగుతోందని, పోలీసులు నిరంతరం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ మాదక ద్రవ్యాల రవాణా పూర్తిగా ఆగడం లేదని తెలిపారు. గంజాయి సాగు ఎక్కడ జరుగుతోందో గుర్తించి పూర్తిగా అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతాయని డీజీపీ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
0 కామెంట్‌లు