బసాపురంలో ఎమ్మార్పీఎస్ 'గో టు విలేజ్' కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఆదోని మండలం బసాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 'గో టు విలేజ్' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌లు దమ్ము చిన్న వెంకటేశ్వరులు మాదిగ, పులిగొట్ల గోపి మాదిగ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టౌన్ ఇన్‌చార్జ్ మాదాస్ జగన్నాథ్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు పూర్తిస్థాయిలో అందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని అన్నారు. ప్రతి మాదిగ కుటుంబం తమ పిల్లలను ఐదేళ్లు నిండగానే పాఠశాలలో చేర్పించాలని, పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి డిప్లొమా కోర్సులు, ఇంటర్‌లో MPC, BiPC, HEC గ్రూపులు ఎంచుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వరకు చదువును కొనసాగించాలని, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమై ప్రతిభ చాటాలని యువతకు పిలుపునిచ్చారు. అలాగే జూలై 7న ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్. నరసింహ, మొగతాళి విజయరాజు, ప్రహ్లాద్, ప్రకాష్, ఉరుకుందు తదితరులతో పాటు బసాపురం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు