వర్షాకాల వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

వర్షాకాల వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎస్‌టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమితులైన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌరీ ప్రసాద్, ఏరియా ఆసుపత్రి వైద్యులు, పీహెచ్‌సీ వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి ఆయనను అభినందించారు.అనంతరం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైద్య శాఖ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్‌తో పాటు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారికి వెంటనే వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించాలని చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత, తాగునీటి భద్రత, దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు నివారణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు