ఎమిలి,ఎక్సలెంట్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ వీరస్వామి


అశ్వాపురం మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించేందుకు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) వీరస్వామి శుక్రవారం అశ్వాపురంలోని ఎమిలీ పబ్లిక్ స్కూల్, ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలల గుర్తింపు పత్రాలు, విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు, హాజరు నమోదులు, విద్యా రికార్డులు, మౌలిక వసతులు, తరగతి గదుల నిర్వహణ, పారిశుద్ధ్యం, ఆటస్థలం ,బోధన సిబ్బంది అర్హతలు, ప్రభుత్వ నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించి పలు అంశాలపై వివరణలు కోరారు.పాఠశాలకు సంబంధించిన బోధన సిబ్బంది వివరాలు, విద్యార్థుల సంఖ్య, ఫీజు నిర్మాణం, టైమ్‌టేబుల్, పీరియడ్ ప్రణాళిక, గుర్తింపు వివరాలు తదితర సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నోటీస్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.అనంతరం ఉపాధ్యాయుల విద్యార్హతల ధ్రువపత్రాలను పరిశీలించిన ఎంఈవో, బోధన సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వం నిర్దేశించిన విద్యా ప్రమాణాలు, భద్రతా నిబంధనలు, పరిపాలనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు సురక్షితమైన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని ఎంఈవో వీరస్వామి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, సిఆర్పి రమాదేవి పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు