ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ హక్కుల ఉద్యమ నాయకుడు చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్ లభించింది. సామాజిక సేవ, ప్రజా నాయకత్వం, ఆదివాసీ సంక్షేమం కోసం ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్‌లెన్స్ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.
కరకగూడెం మండలంలోని చిరుమల్ల కుగ్రామం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన చందా లింగయ్య, తన కృషి, పట్టుదలతో ప్రజల మన్ననలు పొందారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆయన ప్రజా ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచింది. ప్రజల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేశారని పలువురు పేర్కొంటున్నారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణ, విద్యా అవకాశాల విస్తరణ, వైద్య సదుపాయాల మెరుగుదల, తాగునీరు, రహదారులు, ఉపాధి వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. గిరిజనుల సంక్షేమం కోసం సాగించిన ఉద్యమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల ఆయన అభిమానులు, అనుచరులు, ఆదివాసీ సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
0 కామెంట్‌లు