నాగర్ కర్నూల్ జూలై 03 (ఎస్ బి న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం వెలమలపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 20వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ, వివరాల ధ్రువీకరణ, డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్రామంలోని 348 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను శాతం వందకు పంపిణీ చేసినట్లు, ఐదుగురు ఓటర్ల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అలాగే వంగూరు మండలంలోని 33,395 మంది ఓటర్లలో ఇప్పటివరకు 90 శాతం మందికి ఫారాల పంపిణీ పూర్తయినట్లు తహసీల్దార్ తెలిపారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), సూపర్‌వైజర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, గ్రామంలోని ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రతి అధికారిపై ఉన్న బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఫారాల పంపిణీని పూర్తిచేసి, నింపిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా స్వీకరించాలని, అనంతరం వాటిలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయస్సు, కుటుంబ వివరాలు, గుర్తింపు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని, చిన్నపాటి తప్పిదాలు కూడా భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లను మరోసారి సంప్రదించి ఫారాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ఫారాలు నింపడంలో అవసరమైన సహాయం అందించాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రతి బూత్ పరిధిలో రోజువారీ పురోగతిని సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తూ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని, సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అనంతరం నమోదు రికార్డులు, ఫారాల నిర్వహణ, డిజిటల్ నమోదు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, వంగూరు తహసీల్దార్ మురళీమోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు