15 ఏళ్లుగా పట్టాలు.. ఇళ్లకు మాత్రం నోచని నిరుపేదలు

అక్టోబర్‌లోగా ఇంటి స్థలాలు ఇవ్వకపోతే మరో పోరాటం
-సీపీఎం హెచ్చరిక.. తాత్కాలికంగా ఉద్యమం విరమణ
అచ్చంపేట, జూలై 8: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ అంశంపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. అక్టోబర్‌లోగా ఇంటి స్థలాల పంపిణీ పూర్తి చేయకపోతే మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం మండల కార్యదర్శి ఎం. శంకర్ నాయక్ హెచ్చరించారు.ఆయన మాట్లాడుతూ, సర్వే నంబర్ 26/2లోని 5 ఎకరాల 20 గుంటల భూమిలో 15 సంవత్సరాల క్రితం 116 మంది నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటి వరకు వారికి స్థలాల స్వాధీనం చూపించకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని అన్నారు.ఈ సమస్య పరిష్కారం కోసం సీపీఎం పిలుపుతో లబ్ధిదారులు గుడిసెలు వేసుకునే కార్యక్రమాన్ని చేపట్టగా, తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని లబ్ధిదారులతో చర్చించారు. గతంలో మంజూరైన పట్టాలను పరిశీలించి, నిజమైన అర్హులను గుర్తించి అక్టోబర్ నెల తర్వాత ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటి స్థలాల పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు శంకర్ నాయక్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎండీ లాల్ మహ్మద్, బాలయ్య, ఆంజనేయులు, బాబర్, బారిమ గౌరి, బాల్‌రాజ్, షరీఫా, నాగమ్మ, ఆశన్నతో పాటు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు