IIIT-బాసరలో సీట్లు సాధించిన ZPHS విద్యార్థులకు ఘన సన్మానం
మణుగూరు: మణుగూరు జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS) విద్యార్థులు ప్రతిభ కనబరిచి IIIT-బాసరలో సీట్లు సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో చదివిన రమనిక (565/600 మార్కులు), వికాస్ (563/600 మార్కులు) రాష్ట్రస్థాయి పోటీలో రాణించి IIIT-బాసరలో ప్రవేశాలు పొందారు.
ఈ సందర్భంగా సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.
విద్యార్థుల ఈ విజయం గ్రామానికి, పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్న ప్రజాప్రతినిధులు, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.
కష్టపడి చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరని రమనిక, వికాస్ మరోసారి నిరూపించారు.
0 కామెంట్‌లు