-అక్రమ వసూళ్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి
మణుగూరు, జూన్ 20 (ఎస్‌బీ న్యూస్): పినపాక నియోజకవర్గ పరిధిలోని హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలలో డోర్ డెలివరీ, ఈ-కేవైసీ పేర్లతో వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నుంచి డెలివరీ పేరుతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అశ్వాపురం మండలంలోని అభిరామ్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో ఈ-కేవైసీ ప్రక్రియ కోసం వినియోగదారుల నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే ఈ-కేవైసీ పూర్తయిన తర్వాత అవసరం లేకపోయినా గ్యాస్ పైపులను కొనుగోలు చేయాలని వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన సమయంలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్న కర్నె రవి, ఈ అంశాలపై పౌరసరఫరాల శాఖ, ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.
వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు గ్యాస్ ఏజెన్సీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, డెలివరీ, ఈ-కేవైసీ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
#sbnews
#Manuguru
#Pinapaka
#Ashwapuram
#GasAgency
#EKYC
#ConsumerRights
#GasScam
#HPGas
#BharatGas
#IndianGas
#CivilSupplies
#BhadradriKothagudem
#KarneRavi
#PublicIssue
#SBNews
#TelanganaNews
#LocalNews
#ConsumerProtection
#GasCylinder
#BreakingNews
0 కామెంట్‌లు