గుండాల పీహెచ్‌సీపై తీవ్ర ఆరోపణలు

గుండాల పీహెచ్‌సీపై తీవ్ర ఆరోపణలు
-తల్లి–శిశువు మృతితో మరోసారి వెలుగులోకి వచ్చిన వైద్య సేవల వైఫల్యం
-మృతురాలి దహన స్థలంలో కత్తెర లభ్యం.. పూర్తి స్థాయి విచారణకు కుటుంబ సభ్యుల డిమాండ్
-వైద్యాధికారి సుదీప్ సస్పెన్షన్

*గుండాల మండలం జూన్ 19 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో వైద్య సేవల లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి దాట్ల వనజతో పాటు పుట్టిన ఆడ శిశువు మృతి చెందడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సమాచారం ప్రకారం, శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజను ప్రసవం కోసం గుండాల పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సు సాధారణ ప్రసవం నిర్వహించినట్లు తెలుస్తోంది. పుట్టిన ఆడ శిశువుకు చలనం లేకపోవడంతో వెంటనే ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ వనజ కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

స్థానికుల ఆరోపణల ప్రకారం, గుండాల పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, తగిన వైద్య సదుపాయాలు లేక ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

మృతురాలి దహన స్థలంలో కత్తెర లభ్యం

ఈ ఘటనలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. వనజ మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించగా, గురువారం కుటుంబ సభ్యులు దహన స్థలానికి వెళ్లిన సమయంలో బూడిదలో ఒక కత్తెర కనిపించినట్లు తెలిపారు. దీంతో చికిత్స సమయంలో వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వనజకు సాధారణ ప్రసవమే జరిగిందని, రక్తస్రావం కారణంగానే పరిస్థితి విషమించిందని వైద్యులు చెబుతున్నప్పటికీ, కత్తెర అక్కడికి ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

వైద్యాధికారి సస్పెన్షన్

తల్లి, శిశువు మృతి ఘటనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గుండాల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుదీప్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే, ఘటన జరిగిన సమయంలో డాక్టర్ సుదీప్ తూరుబాక గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో ఉన్నారని, ఆస్పత్రిలో ఒకే వైద్యాధికారి ఉండటం వల్ల అందుబాటులో లేరని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై సస్పెన్షన్ విధించడంపై కూడా కొన్ని వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, సస్పెండ్ చేసిన వైద్యాధికారి స్థానంలో మరో వైద్యుడిని నియమించకపోవడంతో గుండాల పీహెచ్‌సీలో వైద్య సేవల భవితవ్యంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు