గుండాల మండలం జూన్ 24 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సజ్జలబోడు గ్రామంలో తెరకెక్కుతున్న “రుద్రారణ్య” సినిమా షూటింగ్ సందర్భంగా సోమవారం యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఆపశ్రుతి చోటుచేసుకుంది. చిత్రీకరణలో భాగంగా నిర్వహించిన సన్నివేశంలో ఒక కారు ముందున్న జీపును ఢీకొనడంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
సినిమా కథకు అనుగుణంగా చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సన్నివేశంలో నియంత్రణ కోల్పోయిన కారు జీపు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు బోనెట్, హెడ్‌లైట్లు, ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. సంఘటనలో నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎవరూ గాయపడకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
దర్శకుడు దుష్యంత్ దీకొండ మాట్లాడుతూ, “యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చిన్నపాటి ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షూటింగ్‌ను కొనసాగిస్తాము” అని తెలిపారు.
ఈ ఘటనతో షూటింగ్ ప్రాంగణంలో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. స్థానికులు, చిత్ర యూనిట్ సభ్యులు ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడటంపై సంతోషం వ్యక్తం చేశారు.
0 కామెంట్‌లు