ఆటోలో ప్రసవం ఘటనపై వైద్యశాఖ విచారణ.. తల్లి, బిడ్డ క్షేమం: డిప్యూటీ డీఎంహెచ్‌వో


జానంపేట పీహెచ్‌సీ పరిధిలో ఆటోలో మహిళ ప్రసవం ఘటనపై వైద్యశాఖ స్పందించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అదనపు డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్ బృందంతో కలిసి ఘటనపై విచారణ చేపట్టారు.

విచారణలో బాధితురాలు కాలేటి సంధ్య మాట్లాడుతూ, రెండో కాన్పు కావడంతో మొదట సాధారణ నొప్పులేనని భావించానని, నొప్పులు ఎక్కువ కావడంతో ఆశా కార్యకర్త 108కు సమాచారం ఇచ్చిందని తెలిపింది. అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఆటోలో మణుగూరు ఏరియా ఆస్పత్రికి బయలుదేరగా, అమరావరం దాటిన తర్వాత ప్రసవం జరిగిందని, అనంతరం పాండురంగాపురం వద్ద 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారని వివరించింది. ప్రస్తుతం తాను, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది.

డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌరీ ప్రసాద్‌ను తల్లి, శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం జనంపేట పీహెచ్‌సీలో వైద్యాధికారి, సిబ్బందిని విచారించి, వైద్యాధికారి పీహెచ్‌సీ ఆవరణలోని క్వార్టర్స్‌లోనే 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు