- కమ్యూనిటీ ప్రోగ్రాంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
పినపాక :మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో ఈ మేరకు సూచనలు చేశారు.
ఎస్సై సురేష్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ మలుసూరు స్థానిక ప్రజలు, వాహనదారులకు ముఖ్యంగా మహిళలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా మహిళలను కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలతో పాటు చట్టపరమైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు.
0 కామెంట్‌లు