భద్రాచలంలో 8.580 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

భద్రాచలంలో రూ.4.29 లక్షల విలువైన గంజాయి స్వాధీనం – ఒకరు అరెస్ట్

భద్రాచలం డీఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ ఎస్‌ఐ పి. శ్యాం ప్రసాద్ పోలీసు సిబ్బందితో కలిసి కూనవరం రోడ్డులోని శ్రీ సుప్రియ (హెచ్‌పీ) పెట్రోల్ బంక్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వచ్చిన పల్సర్ మోటార్ సైకిల్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి లగేజ్ బ్యాగ్‌తో దిగిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా నాలుగు ప్యాకెట్లలో మొత్తం 8.580 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

అరెస్టు చేసిన నిందితుడు పర్సిక నాగేశ్వరరావు (45), సుందరయ్య నగర్ కాలనీ, భద్రాచలం నివాసిగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, కొనుగోలుదారు పరారీలో ఉండగా, వారి అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భద్రాచలం పట్టణ ఎస్‌ఐ వి. సతీష్ కేసు నమోదు చేయగా, దుమ్ముగూడెం ఇన్‌స్పెక్టర్, భద్రాచలం ఇన్‌ఛార్జ్ వెంకటప్పయ్య నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ మాట్లాడుతూ, భద్రాచలం ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. గంజాయి విక్రయదారులు, మధ్యవర్తులు, రవాణాదారులు, వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, త్వరలో ప్రత్యేక దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు