అశ్వాపురం మండలం రామచంద్రాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు సబ్బిరెడ్డి కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు.
గత 15 రోజులుగా సుమారు 50 మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబోసినా, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ లేదా సొసైటీ అధికారులు కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయని సిపిఎం విమర్శించింది.
వాతావరణ మార్పులు, అకాల వర్షాల ప్రమాదం దృష్ట్యా రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యే అవకాశం ఉందని నాయకులు హెచ్చరించారు. అలాగే ఎండల తీవ్రత వల్ల తేమశాతం తగ్గి ధాన్యం పొట్లిపోయి తూకం తగ్గిపోతుందని, రైతులు నష్టపోతారని పేర్కొన్నారు.
జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉన్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించగా, రేపటి నుంచే కొనుగోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే రైతులను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి, రైతులు పగడాల శ్రీనివాస్ రెడ్డి, ఎం. సుధాకర్ రెడ్డి, కె. ఎల్లారెడ్డి, ఎం. సమ్మిరెడ్డి, రామన్న తదితరులు పాల్గొన్నారు.
#ధాన్యం_కొనుగోలు #రైతు_సమస్యలు #సిపిఎం #అశ్వాపురం #రామచంద్రాపురం #తెలంగాణ_రైతు_సంఘం
0 కామెంట్‌లు