మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్ సంతోష్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 21 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి):
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.

మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దేవదారికుంట తండాలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, అక్కడికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించిన కలెక్టర్, ఆలస్యం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పంట తేమ శాతం 14 శాతం లోపు ఉండేలా సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ అధికంగా ఉంటే ధర తగ్గే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మొక్కజొన్న నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.

కేంద్రంలో తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, పీఏసీఎస్ సీఈఓ కొమ్ము ఎల్లయ్య, ఆర్ఐ బలరాం, శివ, మల్లేష్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.

— ఎస్‌బి న్యూస్ ప్రతినిధి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు