గురుకులాల్లో వసతి సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: కలెక్టర్ సంతోష్ నాయక్

 గురుకులాల్లో వసతి సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: కలెక్టర్ సంతోష్ నాయక్
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 21 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి):
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, మౌలిక వసతుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ వంటశాలలు, సరుకుల నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల పరిస్థితిని సమీక్షించారు. పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యానికి అది కీలకమని సిబ్బందికి సూచించారు. వంటశాలలో ఆహార తయారీలో నాణ్యత, శుభ్రతపై రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
విద్యార్థులకు అందించే ఆహారం పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. నిల్వ గదుల్లో ధాన్యాలు, ఇతర పదార్థాలను సురక్షితంగా నిల్వ చేసి, గడువు ముగిసిన వాటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలో అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ వారోత్సవాల భాగంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై ప్రశ్నలు అడిగి, ప్రతిభ చూపిన వారిని అభినందించారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంలో కీలకమని అన్నారు.

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలపై కూడా ఆయన ఆరా తీశారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

— ఎస్‌బి న్యూస్ ప్రతినిధి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు