-రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలపై తక్షణ స్పందన
-అలసత్వం ప్రదర్శించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
పినపాక
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం భద్రాచలం మృణల్ శ్రేష్ఠ తో కలసి పినపాక, కరకగూడెం మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పినపాక మండలంలోని ఏడుళ్ల బయ్యారం, పోతిరెడ్డిపల్లి, గోపాలరావుపేట, బోటిగూడెం కేంద్రాలను పరిశీలించారు.ఏడుళ్ల బయ్యారం కేంద్రంలో నిల్వలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం (మాయిశ్చర్ కంటెంట్)ను తనిఖీ చేశారు. కేంద్రంలో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్‌కు, 20 రోజులుగా ధాన్యం కొనుగోలుకు తీసుకువచ్చినా అధికారులు స్పందించడం లేదని, మిల్ ట్యాగింగ్ పూర్తి కాలేదని కారణాలు చెబుతున్నారని రైతులు వివరించారు. దీనిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాధ్యులపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌లు ప్రతిరోజూ తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు .
పోతిరెడ్డిపల్లి వద్ద రైతులు కలెక్టర్ వాహనాన్ని ఆపి తమ సమస్యలను తెలియజేయగా, కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత డీసీఎంఎస్ అధికారిపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.
బోటిగూడెం, బట్టుపల్లి కేంద్రాల్లో కూడా రైతులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. రైతులకు నీడ, తాగునీరు, తూకం యంత్రాలు, టోకెన్ విధానం వంటి అన్ని మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రైతుల నుంచి ధాన్యం స్వీకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, తేమ శాతం పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. తూకం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, తూకం యంత్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. టోకెన్ విధానం ద్వారా రైతులకు సమయానుకూలంగా అవకాశం కల్పించి, ఎవరూ ఎక్కువ రోజులు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్ ట్యాగింగ్, రవాణా ఏర్పాట్లు సమన్వయంతో జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 168 కొనుగోలు కేంద్రాల్లో చెక్‌లిస్ట్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కేంద్రంలో మౌలిక సదుపాయాలు, టోకెన్ విధానం, నాణ్యత పరీక్షలు, తూకం ప్రక్రియ వంటి అంశాలను ప్రతిరోజూ పర్యవేక్షించి లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు.
అనంతరం కరకగూడెం మండలంలోని కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ధాన్యం గ్రేడ్, టోకెన్ విధానం, రైతులకు అందుతున్న సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. రైతులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో భాగంగా పినపాక మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న గోపాల్‌రావుపేట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాల లేఅవుట్, తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అధికారులతో చర్చిస్తూ, పనులను నాణ్యతతో, వేగవంతంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం కొనసాగాలని, ఎలాంటి అలసత్వం లేకుండా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఇన్‌వార్డ్, అవుట్‌వార్డ్ విభాగాలు, రక్తపరీక్ష కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి సమయపాలన పాటించాలని ఆదేశించారు. మందుల నిల్వ గదిని పరిశీలించి అవసరమైన ఔషధాలు సమృద్ధిగా ఉన్నాయా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు.
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా అవసరమైన ఔషధాలను సమృద్ధిగా నిల్వలో ఉంచాలని సూచించారు. ప్రతి రోగికి తక్షణం, నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు విశ్వసనీయమైన వైద్య సేవలు అందించడం ఆరోగ్య శాఖ ప్రధాన బాధ్యత అని కలెక్టర్ అన్నారు .
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు