పొంగులేటిపై బిఆర్ఎస్ నేతల విష ప్రచారం మానుకోవాలి: యూత్ కాంగ్రెస్

పొంగులేటిపై బిఆర్ఎస్ నేతల విష ప్రచారం మానుకోవాలి: యూత్ కాంగ్రెస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఓరుగంటి వీరయ్య భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అసత్యమని, వెంటనే విష ప్రచారం నిలిపివేయాలని హెచ్చరించారు. లేదంటే ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని అన్నారు.

పొంగులేటిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకపోవడంతోనే బిఆర్ఎస్ నాయకులు విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు శుద్ధులు కాదని వ్యాఖ్యానించారు. ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ భయం ఉందన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి పొంగులేటి పెద్ద సవాలుగా మారారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేసిన శపథం నిజమైందని గుర్తు చేశారు. అనంతరం జరిగిన లోక్‌సభ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీపై వరుసగా గెలుపులు సాధించడంతో ఆ పార్టీకి మనుగడ కష్టమైందన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తోందని తెలిపారు. దీంతో ప్రజల్లో పొంగులేటికి మంచి పేరు వస్తుండటాన్ని ఓర్వలేక బిఆర్ఎస్ నేతలు ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా పేదల కోసం అహర్నిశలు కష్టపడుతున్న పొంగులేటికి ప్రజల ఆశీర్వాదాలు అండగా ఉన్నాయని, గులాబీ నాయకుల ఆరోపణలు నిరాధారమని నరేష్ కుమార్ ఖండించారు.

ఈ కార్యక్రమంలో తురుమలగూడెం ఉపసర్పంచ్ ధరావత్ హర్ష నాయక్, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే మోసిన్, అశ్వాపురం మండల సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్, ధరావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు