నాగర్ కర్నూల్, ఏప్రిల్ 01,( ఎస్ బి న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో సన్నవడ్ల బోనస్ పథకంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగీనేని శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు సహాయంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించగా, అంబటిపల్లి గ్రామానికి చెందిన మాజీ పి ఏ సీ ఎస్ (PACS) చైర్మన్ కుటుంబ సభ్యులు దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అసలు వరి సాగు చేయకపోయినా, రికార్డులను తారుమారు చేసి దాదాపు 1400 క్వింటాళ్ల సన్నవడ్లు విక్రయించినట్లు చూపించారని పేర్కొన్నారు.
ఈ తప్పుడు లెక్కలతో పేద రైతులకు అందాల్సిన సుమారు రూ.8 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించారు. భూమి విస్తీర్ణం తక్కువగా ఉన్నా, అసలు జాబితాలో పేర్లు లేకపోయినా బోనస్ పొందడం వెనుక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారి నుండి సొమ్మును రికవరీ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన అర్హులైన రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.
0 కామెంట్‌లు