మణుగూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ
మణుగూరు, ఏప్రిల్ 2: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు–ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు.
గిరిజన మహిళలకు ఐటిడిఏ ద్వారా శిక్షణ ఇచ్చి వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఇతర జిల్లాలకు వెళ్లి తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారని చెప్పారు.
అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో పాటు త్వరలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు భోజన, అల్పాహార పథకాలు విస్తరించనున్నట్లు, దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలు అందించనున్నట్లు వెల్లడించారు.
గ్రామసభలో వచ్చిన సమస్యలను తీర్మానించి ప్రభుత్వానికి పంపించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు