పినపాక మండలం బంధగిరి నగరం గిరిజనులకు పోడు భూములపై పట్టాలు ఇవ్వాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. గిరిజనులకు సిపిఐ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
గురువారం బంధగిరి నగరాన్ని సందర్శించిన ఆయన, అక్కడి గిరిజనులతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనాధారంగా ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డు తగులుతోందని ఆరోపించారు. పోడు భూముల్లో ఫెన్సింగ్ చేయడం ద్వారా గిరిజనులను నిరాశ్రయులుగా మారుస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ అధికారులు గిరిజనుల సాగు భూముల్లో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. గిరిజనులను ఇబ్బంది పెడితే సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.
అనంతరం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గడ్డం మనోహరాచారి అధ్యక్షత వహించగా, సాబీర్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ 100 ఏళ్ల చరిత్రలో అనేక ఉద్యమాలు నిర్వహించిందని, పినపాకలో సిపిఐ బలమైన పార్టీగా ఉందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని, ఈ నెల 26న చినపాక మండల మహాసభను భారీ స్థాయిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సరెడ్డి పుల్లారెడ్డి, మున్న లక్ష్మీకుమారి, పూర్ణచంద్రరావు, పత్తిపాటి నాగేశ్వరావు, పద్మనాభరాజు, దుగ్యాల సుధాకర్, తోగటి కుమార్, తోట రమేష్, బట్టా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు