మణుగూరు, ఏప్రిల్ 14: మణుగూరు సింగరేణి ఏరియాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
దేశ, రాష్ట్రాలకు ఇంధన వనరులు అందించే సింగరేణి కార్మికులు అత్యవసర సేవల కింద పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరాలో వివక్షత చూపుతున్నాయని ఆయన విమర్శించారు. అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరా సక్రమంగా ఉందని ప్రభుత్వాలు చెప్పే మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మంగళవారం మణుగూరు ప్రాంతంలో వందలాది కార్మికులు, మహిళలు, చిన్నారులు ఎండలో గంటల తరబడి గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్లో నిలబడిన ఘటన దీనికి నిదర్శనమని తెలిపారు. రాత్రి షిఫ్ట్ పూర్తి చేసిన కార్మికులు విశ్రాంతి లేకుండా గ్యాస్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మహిళలు, వృద్ధులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గ్యాస్ గోదాం వద్ద తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరమని, కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. ఇదే సమయంలో టిబిజికెయస్ ఆధ్వర్యంలో క్యూలో ఉన్న వారికి కూల్ వాటర్ క్యాన్ల ద్వారా తాగునీరు అందించినట్లు తెలిపారు.
మణుగూరు ఏరియాకు గ్యాస్ సరఫరా సక్రమంగా చేయాలని కోరుతూ ఈ నెల 8న కొత్తగూడెం సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు మంగళవారం 340 గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆదేశాలు జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణి కార్మికుల శ్రమను గుర్తించి, మణుగూరు ప్రాంతానికి తగినంత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని, క్యాంటీన్లలో భోజన సౌకర్యాలు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను నాగెల్లి వెంకటేశ్వర్లు కోరారు.
0 కామెంట్‌లు