📍 పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మాదిగలకు జనాభా ప్రాతిపదికన 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కో-కన్వీనర్ వంగూరి రామ్మూర్తి మాదిగ అధ్యక్షతన పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దేపంగి రమణయ్య మాదిగ మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం మాదిగలకు 11 శాతం వాటా ఇవ్వాలని కోరారు. మాదిగల జనాభా 10 నుంచి 11 శాతం వరకు ఉందని, కుల గణన పూర్తి స్థాయిలో జరిగితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. 9 శాతం రిజర్వేషన్లను సమర్థించిన వారు జాతికి అన్యాయం చేసినట్టేనని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలులో భాగంగా మాదిగలకు 11 శాతం వాటా కేటాయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మాదిగల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, జాతి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవాల కమిటీలో మందకృష్ణ మాదిగకు స్థానం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి సోమయ్య మాదిగ, జిల్లా కన్వీనర్ నల్లగట్ల వెంకన్న మాదిగ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు