భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం (09-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
మండలంలో బెల్ట్ షాపులు ఎంఆర్పీ ధర కంటే రూ.40 నుంచి రూ.50 వరకు అధికంగా వసూలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అదనపు ధరలు వసూలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ మద్యం దందాను పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు సిండికేట్ నిర్వహణతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిసాయని, లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా షాపుల నిర్వాహకులు కలిసి గ్రామాల్లోని కిరాణా షాపులు, హోటళ్లకు యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. కొన్నిచోట్ల మద్యం కొరత ఉందని కృత్రిమంగా చూపిస్తూ అధిక లాభాల కోసం అక్రమ కేంద్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
మండలంలోని గ్రామాల్లో వందల సంఖ్యలో బెల్ట్ షాపులు నడుస్తున్నప్పటికీ స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు