నాగర్‌కర్నూల్, మార్చి 9 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూలో కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ వడ్డించాల్సి ఉండగా, పాఠశాలలో మాత్రం వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే అందిస్తున్నట్లు గమనించారు. వడ్డించిన అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ నాణ్యత కూడా బాగా లేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌ను ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, పరీక్షలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్, ఆర్డీవో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు