స్వతంత్ర భారత్ ములుగు మార్చి 23: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి మతి భ్రమించినట్లుందని ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గారు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌పై అవగాహన లేకపోతే, అవగాహన ఉన్నవారితో తెలుసుకోవాలని ఆమె సూచించారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించగా, ప్రజల ప్రయోజనాలు నచ్చక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రేగ కళ్యాణి పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు అమలు చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. పేదల విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మాట్లాడని సత్యవతి రాథోడ్ ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, తాజా బడ్జెట్‌లో అనేక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా, డిజిటల్ హెల్త్ కార్డులు, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత వంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
విద్యారంగ అభివృద్ధి కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.5000 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి రూ.73,894 కోట్లు, విదేశీ విద్యకు రూ.480 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే కళ్యాణ లక్ష్మీ పథకానికి రూ.3,683 కోట్లు, గురుకులాల్లో ఆధునిక కిచెన్లకు రూ.50 కోట్లు కేటాయించారని వివరించారు.
గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు, పోడు భూముల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారని చెప్పారు.
ఇలా అన్ని రంగాల అభివృద్ధి కోసం సమగ్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా, బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం తగదని రేగ కళ్యాణి అన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు బడ్జెట్‌ను మరోసారి పరిశీలించాలని కోరారు
0 కామెంట్‌లు