అక్రమ ఇటుక బట్టీలను సీజ్ చేయాలి: తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాలు

అక్రమ ఇటుక బట్టీలను సీజ్ చేయాలి: తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల డిమాండ్
మణుగూరు, మార్చి 23: అశ్వాపురం మండలంలో అటవీ కలపను అక్రమంగా వినియోగిస్తూ నడుస్తున్న సుమారు 70 ఇటుక బట్టీలను తక్షణమే సీజ్ చేయాలని తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం మణుగూరు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్‌డీఓ)కు వినతిపత్రం సమర్పించాయి.
ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్లేం కోటి, ఆదివాసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర మాట్లాడుతూ, సీతారాంపురం, గొందిగూడెం, తుమ్మల చెరువు, జగ్గారం గ్రామాల్లో రాత్రివేళల్లో భారీగా అటవీ కలపను వినియోగిస్తూ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల కోట్లాది రూపాయల అటవీ సంపద నష్టపోతుందని పేర్కొన్నారు.
అటవీ హద్దులలోనే ఇటుక బట్టీలు నడుపుతూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, అక్రమంగా కలప రవాణా జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత బట్టీలను వెంటనే సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌డీఓను కోరారు.
దీనిపై స్పందించిన ఎఫ్‌డీఓ అక్రమ కలప రవాణాను అరికట్టి, అటవీ ప్రాంతాల్లో నడుస్తున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తాటి మధు, గుమ్మడి రామ్ కుమార్, పాయం సూరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు