గ్యాస్ కొరతతో పేదలకు కష్టాలు – రైతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం


- గ్యాస్ లేక కట్టెల కోసం తిరగాల్సిన పరిస్థితి దాపురించింది 
- రైతుబంధు సమయానికి రాక ప్రస్తుతం వచ్చేవి వడ్డీకే సరిపోతున్నాయి 
- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య 

గ్యాస్ సరఫరా సమయానికి అందక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరిగిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య తీవ్రంగా విమర్శించారు. సోమవారం సాయంత్రం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణ ప్రజలకు అందని ద్రవ్యంగా మారాయని అన్నారు. ఒకప్పుడు పేదలు కూడా సులభంగా వాడగలిగిన గ్యాస్ ఇప్పుడు భారంగా మారిందని పేర్కొన్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సమయానికి సరఫరా కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టెల కోసం తిరగాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అడ్డుకునేలా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా సబ్సిడీలు పెంచాలని, గ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై కూడా కనకయ్య తీవ్రంగా స్పందించారు. వరి పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చాలా మంది రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయలేదని ఆరోపించారు. రైతుల పక్షపాతిగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
పంట చేతికి వచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాలను సమయానికి ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని తెలిపారు. మధ్యవర్తుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నారు.
రైతుబంధు పథకం అమలు విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. పంట వేసే సమయంలో అందాల్సిన రైతుబంధు సాయం పంట కోత సమయంలో ఇవ్వడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. ఇచ్చిన సాయం కూడా వడ్డీలకు సరిపోని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
ఇంకా రైతుబంధు ఎన్ని ఎకరాలకు ఇస్తారనే విషయంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని కనకయ్య విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు కేవలం ప్రకటనలకే పరిమితమైపోయాయని అన్నారు.ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు