తేదీ: మార్చి 25, బుధవారం
ఇందిరమ్మ గృహాల విషయంలో ఆదివాసీలకు అన్యాయం: బంధాల గ్రామ ప్రజల ఆవేదన
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీలో ఆదివాసీ గిరిజనులకు ఇందిరమ్మ గృహాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎస్‌బి ఛానల్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.
బంధాల గ్రామపంచాయతీ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయని, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆదివాసీ ప్రజలు ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా పలుమార్లు దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం రాలేదని వారు తెలిపారు. కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్యలకు పరిష్కారం లభించలేదని వాపోయారు.
అసెంబ్లీలో మాటలు మాత్రమే ఉంటున్నాయని, కానీ పేదలకు గ్రామాల్లో ఇండ్లు మాత్రం కేటాయించడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతున్నారని, తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి కూడా స్పందించడం లేదని అన్నారు.
ఇప్పటికైనా రెండో విడతలో బంధాల గ్రామపంచాయతీకి చెందిన ఐదు గ్రామాలకు ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ధనుసరి సీతక్క గారిని గ్రామ ప్రజలు కోరారు.
ఈ కార్యక్రమంలో బంధాల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు