ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి – లింగాల, బల్మూర్ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ పరిశీలన

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి – లింగాల, బల్మూర్ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ పరిశీలన
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల, బల్మూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిలభారతి విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో లింగాల మండలం హైస్కూల్‌లో సభ్యత్వ కార్యక్రమం, నూతన కమిటీల ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అలాగే పూర్తి స్థాయిలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా పుస్తకాలు అందలేదని, ఏకరూప దుస్తులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు.
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని, జీఓ నంబర్ 42ను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బల్మూర్ పట్టణ హైస్కూల్‌లో కిచెన్ రూమ్ పూర్తిగా కూలిపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అనంతరం లింగాల, బల్మూర్ మండలాల ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీలను ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ నాయకులు మధు, ఆంజనేయులు, సురేష్, వాసు, శివ, బాలమణి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
#ప్రభుత్వపాఠశాలలు
#మౌలికసదుపాయాలు
#AISF
#విద్యార్థిసంఘం
#లింగాల
#బల్మూర్
#అచ్చంపేట
#NagarKurnool
#EducationIssues
#TelanganaEducation
#SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు