డబుల్ ఓటింగ్ కార్డుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది

ఒకే ఓటర్‌కు రెండు చోట్ల ఓటింగ్ కార్డులు ఉన్నట్లయితే వాటిలో ఒక కార్డును తొలగిస్తున్నామని తాసిల్దార్ గోపాల కృష్ణ, కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పినపాక మండల తాసిల్దార్ కార్యాలయంలో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కలెక్టర్, ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు డబుల్ ఓటింగ్ కార్డుల గుర్తింపు, తొలగింపు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు అయి ఉంటే, ఆ వివరాలు సంబంధిత అధికారిక సైట్‌లో అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.
ఆ వివరాల ఆధారంగా సంబంధిత ఓటర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, వారి సమ్మతితో ఒక ఓటును మాత్రమే కొనసాగించి, మిగిలిన ఓటును తొలగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ వల్ల ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా మారుతుందని, ఎన్నికల నిర్వహణలో గందరగోళం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు