సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలను అందించాల్సిన విద్యను నేటి పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలే మార్గమని ఆయన పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని టీఎన్‌జీఓ భవన్‌లో శనివారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా రెండో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పుట్ట లక్ష్మణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ, “అందరికీ విద్య” అనే నినాదంతో కొందరికే విద్యను పరిమితం చేసిన ఘనత పాలకులదేనని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోగా, కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.
నూతన జాతీయ విద్యావిధానం–2020 పేరుతో విద్యా కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో 3,680 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే యోచన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఆశ్రమ విద్యాసంస్థల్లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అల్లాడుతున్నారని ఆరోపించారు. దీనికి బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలల్లో అమలుకాని మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విద్యాధికారులు లేరని తెలిపారు. కళాశాల విద్యలో 7,550 బోధనా–బోధనేతర పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో 2,560 బోధనా, 3,000 బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.8 వేల కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎండీ ఫయాజ్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన నిరంతర పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్‌కుమార్, సీపీఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి గోపాల్తో పాటు ఏఐఎస్ఎఫ్ నాయకులు అభిలాష్, అనూష, శిరీష, బాలాజీ, అర్జున్, భాను ప్రసాద్, వెంకటేష్, సరిత, ఇందు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు