లక్షణాలు తెలుసుకోండి… ప్రాణాలు కాపాడుకోండి

లక్షణాలు తెలుసుకోండి… ప్రాణాలు కాపాడుకోండి
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా డాక్టర్ శృతి మాటల్లో 

పినపాక 

 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పినపాక మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డా. శృతి క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డా. శృతి మాట్లాడుతూ, క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలపై వివరించారు. ఛాతిలో గడ్డలు ఏర్పడటం, ఆకస్మిక నొప్పి, చర్మంలో మార్పులు, నిప్పుల్ నుంచి అసాధారణ స్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్రమం తప్పకుండా స్వీయ పరీక్షలు, అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
అదేవిధంగా తంబాకు, పొగాకు సేవించడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించారు. గుట్కా, సిగరెట్లు, బీడీలు వంటి అలవాట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని, వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. యువత ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, శుభ్రమైన జీవన విధానం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని డా. శృతి తెలిపారు. అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెరిగి, ముందస్తు జాగ్రత్తల ప్రాముఖ్యతపై చైతన్యం కలిగిందని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు