నిరంతరం పేద ప్రజల అభివృద్ధికే ఎర్రజెండా

నిరంతరం పేద ప్రజల అభివృద్ధికే ఎర్రజెండా
రెండో వార్డు సీపీఎం అభ్యర్థి ఆర్. శ్రీనివాసులు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 06 (ఎస్‌బి న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్. శ్రీనివాసులు, పేద ప్రజలు ఆదరిస్తే వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆరో రోజు ఇంటింటా, వీధివీధి తిరుగుతూ కాలనీ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణానికి చివరన ఉన్న రెండో వార్డులో ఇప్పటికీ అనేక మంది పేదలకు సొంత ఇళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. చిన్న చిన్న పూరి గుడిసెల్లో నివసిస్తూ కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రెండు మూడు రోజులకు ఒక్కసారే నీరు సరఫరా కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కాలనీలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే రోజువారీ కూలీపై జీవించే కార్మిక కుటుంబాలు అధికంగా నివసిస్తున్నాయని, మార్కెట్‌లో చాటకూలీలు, మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, లోడింగ్–అన్‌లోడింగ్ చేసే హమాలీ కార్మికులు ఉన్నప్పటికీ వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.
పేదల పక్షాన నిలిచే కార్మిక నాయకుడిగా, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు అండగా ఉండే నేతను గెలిపిస్తే రెండో వార్డును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని శ్రీనివాసులు ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్య నాయక్, కందికొండ గీత, ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య, శంకర్ నాయక్, గుంపల్లి అశోక్, తారా నాగరాజు, మాజీ ఎంపీటీసీ ఏ. యాదయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు