గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం -అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 06 (ఎస్‌బి న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని పలకపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ మహిళా సమాఖ్య భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పలకపల్లి గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు తోడుగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో, స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ఈ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఎంతటి భారం అయినా మోసేందుకు సిద్ధంగా ఉందని డా. వంశీకృష్ణ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు