అమరజీవి కామ్రేడ్ జోగ నరసయ్య స్మారక స్థూప నిర్మాణానికి సహకరించండి – సిపిఎం పిలుపు

ఖమ్మం, ఫిబ్రవరి 27 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

ప్రజా నాయకుడు, ఆదివాసి ముద్దుబిడ్డ అమరజీవి కామ్రేడ్ జోగ నరసయ్య స్మారక స్థూపం నిర్మాణానికి ఆర్థికంగా, హార్దికంగా సహకరించాలని సిపిఎం పార్టీ నేతలు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా జోగ నరసయ్య అకాల మరణం చెందడం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. మారుమూల గుండాల మండలం తూరుబాక గ్రామంలో జన్మించిన జోగ నరసయ్య విద్యార్థి దశ నుంచే విప్లవ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం సైకిల్ యాత్ర నిర్వహించి విద్యార్థులను చైతన్యపరిచిన నాయకుడిగా గుర్తింపు పొందారని వివరించారు.

గుండాల మండలంలో జూనియర్ కళాశాల స్థాపన, ఎస్‌ఎంహెచ్ హాస్టల్ సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. జీవో నెంబర్ 3 అమలు, ప్రత్యేక డీఎస్సీ నిర్వహణ వంటి అంశాలపై ఉద్యమాలను ఉదృతం చేశారని చెప్పారు. 2007 సంవత్సరంలో సిపిఎం పార్టీ సభ్యత్వం స్వీకరించిన జోగ నరసయ్య, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల దౌర్జన్యాలను అరికట్టాలని, ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు.

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ తక్కువ కాలంలోనే “జోగ నర్సన్న”గా ప్రజల్లో మన్ననలు పొందారని తెలిపారు. కబడ్డీ క్రీడాకారుడిగా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహ స్థాపనకు కృషి చేశారని పేర్కొన్నారు.

జోగ నరసయ్య ఆశయాలను సాకారం చేయాలంటే ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయాలని, ఆయన స్మారక స్థూపం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు తోలెం గోపి, దుగ్గి రామ్మూర్తి, జోగ రాజేష్, కల్తీ శేఖర్, గడ్డం కృష్ణ, జోగ సారమ్మ, అరెం రామకృష్ణ, దుగ్గి అనిల్, దుగ్గి సత్యం, ఊకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు