ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో కొనసాగుతున్న ఆటో జాత రెండో రోజు పెద్ద తుంబలం గ్రామం నుంచి ప్రారంభమైంది.
ఈ ఆటో జాత కుప్పగల్లు, పాండవగల్లు, బల్లెకల్లు, గనేకల్లు, కడితోట, జి.హోసల్లి, హానవాలు, మదిరే, బలదూరు, సంతకుడ్లూరు, చిన్న హరివాణం, చిన్న గోనెహాలు, బసాపురం, చాగి నారాయణపురం, డాణాపురం గ్రామాల మీదుగా కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న,
సిఐటియు మండల కార్యదర్శి బి.వీరారెడ్డి,
వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు,
సిఐటియు మండల అధ్యక్షులు జే.రామాంజనేయులు ప్రసంగించారు.
వక్తలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల అనేక గ్రామాల్లో పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వి.బి.జి.రాంజీ పథకాన్ని అమలు చేస్తే మళ్లీ పాతకాలం నాటి వలసలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అలాగే నాలుగు లేబర్ కోడ్‌లు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన చట్టాల వల్ల కార్మికులు, రైతులు మాత్రమే కాక సామాన్య ప్రజానీకంపైనా అదనపు పని భారం, విద్యుత్ చార్జీల భారం పడుతుందని తెలిపారు.
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని విమర్శించారు.
కావున గ్రామీణ కార్మికులు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ పెద్ద సంఖ్యలో ఫిబ్రవరి 12వ తేదీన ఆదోని పట్టణంలో నిర్వహించే ర్యాలీలో పాల్గొని సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఆటో జాతాలో సిఐటియు మండల నాయకులు పాండురంగ, ఆటో యూనియన్ నాయకులు అనీఫ్ బాషా, స్థానిక నాయకులు హనుమంత్ రెడ్డి, వెంకటేష్, నర్సిరెడ్డి, ఆటో యూనియన్ కార్యకర్తలు రవి, వీరేష్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు