ఇంజనీరింగ్ విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలి – సత్రపల్లి సాంబశివరావు (సీపీఐ(ఎం))
పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు శుక్రవారం మొండికుంట అడవిలో బోల్తా పడిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదానికి కళాశాల యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. 40 మంది సామర్థ్యం ఉన్న బస్సులో 60 మంది విద్యార్థులను ఎక్కించడం, ఇద్దరు కూర్చోవాల్సిన సీట్లలో ముగ్గురు–నలుగురిని కూర్చోబెట్టడం వల్ల విద్యార్థులు నిలబడి ప్రయాణించాల్సి వస్తోందని విమర్శించారు. ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు.
బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా అన్న అంశంపై కూడా అధికారుల విచారణ అవసరమని పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులు మొత్తం కళాశాల యాజమాన్యమే భరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సీట్లకు సరిపడా విద్యార్థులనే ఎక్కించి, ఫిట్నెస్ కలిగిన బస్సులతో, అర్హత ఉన్న డ్రైవర్లతో రవాణా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
