ఖమ్మంలో జనవరి 18న జరగనున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) 100 సంవత్సరాల ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 3న చర్లలో ప్రారంభమైన ప్రచార జాత బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మీదుగా జనవరి 4న సాయంత్రం 4 గంటలకు పినపాక చేరుకుంటుందని తెలిపారు. పినపాక ప్రధాన రహదారి కూడలిలో సమావేశం నిర్వహించి, అక్కడి నుంచి కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల ప్రాంతాలకు ప్రచార జాత కొనసాగుతుందని వివరించారు.
శుక్రవారం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్‌లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పినపాక మండల కార్యదర్శి పద్మనాభ రాజు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న సరెడ్డి పుల్లారెడ్డి ప్రసంగించారు. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఖమ్మంలో దాదాపు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా సిపిఐ కార్యకర్తలు ప్రచార జాతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
జనవరి 18న జరిగే బహిరంగ సభకు పినపాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సమితి సభ్యులు పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహర చారి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి గడ్డం వెంకటాచారి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి తోగటి కుమార్, ఐలయ్య రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
