హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణం పిల్లల కళ్ల ముందే జరగడం మరింత విషాదకరం.
నల్గొండ జిల్లా హుజురానగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి దంపతులు నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే వెంకటేష్ భార్యపై తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు పాల్పడేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్య త్రివేణి ఇటీవల పుట్టింటికి వెళ్లింది.
అక్కడికి వెళ్లిన వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుంటానని, ఇకపై బాగా చూసుకుంటానని నమ్మించి త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. కానీ కొద్ది రోజులకే మళ్లీ అనుమానంతో గొడవకు దిగిన అతడు విచక్షణ కోల్పోయి భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన త్రివేణి అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కేవలం 12 గంటల్లోనే వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల లేక అనాథలుగా మిగలడం హృదయవిదారకంగా మారింది. తల్లి మృతి వార్తతో పిల్లలు విలపిస్తున్న దృశ్యాలు అక్కడివారిని కలచివేశాయి.
