- సమిష్టిగా శ్రమిస్తున్న అధికారులు, ఎస్జీఎఫ్ సిబ్బంది
పినపాక
పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–17 బాలుర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో అధికారులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.
పాఠశాలల క్రీడాసమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్, ఎంపీడీవో సంకీర్త్, తహసిల్దార్ గోపాలకృష్ణ,పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎంఈవో కొమరం నాగయ్య, ఏడూళ్ల బయ్యారం ఇంచార్జి హెచ్‌ఎం తిరుపతి రెడ్డి, పీడీ వీరన్న, పంచాయతీ కార్యదర్శులు జయపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు రోజువారీగా పాఠశాల ప్రాంగణంలో పర్యవేక్షణ చేపడుతున్నారు.
క్రీడాకారుల వసతి, భోజనం, రవాణా, భద్రతతో పాటు పోటీ వేదికల సిద్ధత, మైదానాల నిర్వహణ, వైద్య సదుపాయాలు, అంబులెన్స్ సేవల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు అమలు చేస్తున్నారు.
అదేవిధంగా న్యాయనిర్ణేతలు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బందితో సమన్వయం కొనసాగిస్తూ పోటీలు సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. క్రీడాస్ఫూర్తి,న్యాయసమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ పోటీలు నిర్వహించేందుకు ఎస్జీఎఫ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
