అచ్చంపేటలో అన్ని సౌకర్యాలు కల్పించాలి – లోపాలు లేకుండా చూడాలి
నాగర్ కర్నూల్, జనవరి 29(ఎస్ బి న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నియమితులైన గ్రూప్–వన్ అధికారులకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని యువజన శిక్షణ కేంద్రంలో నిర్వహించనున్న శిక్షణా తరగతుల ఏర్పాట్లను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం పరిశీలించారు.
ఒక విడతలో 150 మంది గ్రూప్–వన్ అధికారులు ఈ శిక్షణకు హాజరుకానున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, భోజనం, శిక్షణ తరగతుల నిర్వహణకు సంబంధించిన గదులు, సమావేశ మందిరాలు తదితర సౌకర్యాలను అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
శిక్షణ తరగతులు నిర్వహించే గదుల్లో కూర్చోవడానికి తగిన సదుపాయాలు, విద్యుత్ సరఫరా, తాగునీరు, శుభ్రత, భద్రత వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాత్రి వసతి ఏర్పాట్లు, భోజన నాణ్యత, వంటశాల నిర్వహణ, మరుగుదొడ్లు, మూత్రశాలల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
శిక్షణకు హాజరయ్యే గ్రూప్–వన్ అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తిచేయాలని, శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
ఈ పరిశీలనలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.
