సరఫరా పాయింట్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్, జనవరి 29( ఎస్ బి న్యూస్ ):నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని హాకా రైతు సేవా కేంద్రంతో పాటు యూరియా సరఫరా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా ఎరువుల లభ్యత, సరఫరా, పంపిణీ పరిస్థితులను ఆయన పరిశీలించారు.
యూరియా నిల్వలు, సరఫరా విధానం, రైతులకు పంపిణీ ప్రక్రియ, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ,డిమాండ్–సరఫరా సమతుల్యత వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా ఆరా తీశారు. యూరియా పంపిణీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండాచర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న తాజా వెర్షన్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, జిల్లాలోని ఏ దుకాణం నుండైనా యూరియాను బుక్ చేసి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. యాప్ ద్వారా జరుగుతున్న అమ్మకాలపై రైతులు, డీలర్ల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు యూరియా తీసుకునే సమయంలో తప్పనిసరిగా బుకింగ్ ఐడీని డీలర్‌కు చూపించాలని, యాప్‌లో బుక్ చేసిన సంచుల సంఖ్య మేరకే యూరియా అందించాలని షాప్ యజమానులకు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాకు అవసరమైన యూరియా ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని, వ్యవసాయ సీజన్‌లో యూరియా సరఫరా అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు విక్రయించాలని, యూరియా పంపిణీలో అక్రమాలు జరగకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ మరింత పెంచాలని ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా నిల్వలు ఉంచాలని సూచించారు.
జిల్లాలోని రైతులందరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
