Subscribe Us

SB LATEST:

29, జనవరి 2026, గురువారం

విధుల పట్ల నిర్లక్ష్యం: స్కూల్ టీచర్ భూక్య గౌతమి సస్పెన్షన్

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడం, పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేయడం వంటి ఆరోపణలపై ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్య గౌతమిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొన్ని నెలలుగా ఆమె నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ, ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే అంకితభావంతో పని చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.
అదేవిధంగా డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. ఒకరు కార్యాలయ సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ అబద్ధపు వివరణలు ఇవ్వడంపై మెమోలు ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించి అంకితభావంతో పనిచేయాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.