నాగర్ కర్నూల్, జనవరి 09,(ఎస్ బి న్యూస్):నాగర్‌కర్నూలు జిల్లా సింగోటం మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్ర వారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు,ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ సందర్భంగా బోధన విధానం, విద్యార్థుల హాజరు శాతం, పరీక్షల సన్నద్ధతపై సమగ్రంగా పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు. బలహీన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించాలన్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా బోధన విధానంలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.
విద్యార్థుల హాజరు పెంచేందుకు తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని, వారిని పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందన్నారు.
అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండూ సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
