Subscribe Us

SB LATEST:

9, జనవరి 2026, శుక్రవారం

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


మూడో రోజు క్రీడలను తిలకించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలలో భాగంగా శుక్రవారం మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడగా, క్రీడలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మూడో రోజు క్రీడల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో మంత్రికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్తో కలిసి కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, “కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం క్రీడాకారుల జీవితంలో కీలకమైన మలుపు. గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి” అని సూచించారు.
అలాగే, “మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి జాతీయస్థాయి కబడ్డీ పోటీలను ఘనంగా ప్రారంభించడం గర్వకారణం. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల నుంచి 384 మంది క్రీడాకారులు, 74 మంది కోచ్‌లు, జడ్జీలు పాల్గొనడం ఈ పోటీల ప్రాధాన్యతను చాటుతోంది” అని మంత్రి తెలిపారు. ఈ పోటీలను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగాన్ని, క్రీడా శాఖ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు.


 ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ “పినపాక నియోజకవర్గంలోని ఏడూళ్ల బయ్యారం వంటి మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణ ఒక చారిత్రక ఘట్టం. ఈ పోటీల ద్వారా గ్రామీణ, గిరిజన యువతలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి జాతీయస్థాయి పోటీలు మన ప్రాంతానికి వచ్చాయి” అని తెలిపారు. అలాగే, “ఈ కబడ్డీ పోటీలు స్థానిక యువతకు స్ఫూర్తిగా నిలిచి, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి ఎదుగుతారని ఆశిస్తున్నాను” అని ఎమ్మెల్యే అన్నారు.


జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ
“జాతీయస్థాయి క్రీడా పోటీలను మారుమూల గిరిజన ప్రాంతంలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా, అన్ని శాఖల సమన్వయంతో సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం. క్రీడాకారుల భద్రత, వసతి, భోజనం, వైద్య సదుపాయాలు సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, సర్పంచ్ చందర్రావు తదితరులు పాల్గొన్నారు.